గత ఎన్నికల్లో రాష్ట్రంలోని యువత బలంగా మార్పు కోరుకున్నారు. కూటమికి బలంగా నిలబడ్డారు. దాని ఫలితమే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 6 నెలల్లోనే రోడ్లు వస్తున్నాయి. సర్పంచులు భుజాలు ఎగరేసి మరి తాము గ్రామ ప్రథమ పౌరులం అని బలంగా చెప్పుకొంటున్నారు. ముఖ్యమంత్రి గారు, నేను – గిరిజన స్థితిగతులు వారి ఆదాయం, ఆరోగ్యం, రోడ్లు ఇతర సౌకర్యాల గురించి చర్చించుకున్నాం. దీని మొత్తానికి రూ. 2,569 కోట్లు ఖర్చు అవుతుందని నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే ఆయన మరో మాట లేకుండా దశల వారీగా గిరిజన గ్రామాల్లో సమస్యలు తీరుద్దామని హామీ ఇచ్చారు. దానిలో భాగంగా మొదటగా రూ. 350 కోట్లు ఏడాదికి ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించాం. కేంద్రం సహకారం కూడా తీసుకొని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి తీసుకొచ్చేలా చూస్తాం.
• శ్రీ శంకరన్ గారి స్ఫూర్తితో…
గిరిజన ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ ట్రైబుల్ డవలప్మెంట్ అథారిటీ (ఐటీడీఏ)లను తీసుకొచ్చిన గొప్ప ఐఏఎస్ అధికారి శ్రీ శంకరన్ గారి లాంటి చిత్తశుద్ధి అధికారులకు ఉండాలి. అభివృద్ధికి దూరంగా విసిరి వేయబడ్డ మనుషుల పట్ల మానవత్వంతో పాటు, వారి గుండెల్లో గుర్తిండిపోయేలా, బలంగా నిలబడేలా సంకల్పం అధికారులు చేసుకోవాలి. శ్రీ శంకరన్ గారిలా ప్రతి అధికారి ఆలోచిస్తే గిరిజనులకు కష్టాలే ఉండవు. ఆ స్ఫూర్తితో అధికారులు పని చేయాలి.
వివిధ సందర్భాల్లో గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో తిరిగాను. అక్కడ సమస్యలు, ప్రజల ఆటుపోట్లు చూశాను. వారి కోసం బలమైన పనులు చేయాలని నిర్ణయించుకొని ముందుకు వెళ్తున్నాం. అధికారగణం కూడా క్షేత్రస్థాయిలో లోపాలను సవరించుకొని సమన్వయం సాధించాలి. నేను క్షేత్రస్థాయి కష్టాలను మాత్రమే చూడగలను. ఆర్థికంగా ఎలా ముందుకు వెళ్లాలి అనేది ముఖ్యమంత్రి గారి సూచనలతోనే సాధ్యం. నేను అడిగిన వెంటనే విడుదల చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.
• పర్యాటకంగా కొత్త పంథాలో వృద్ధి సాధిద్దాం
రాష్ట్రంలో మన్యం ప్రాంతం ప్రకృతిపరంగా అద్భుతం. పర్యాటకంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. గిరిజన గూడేల్లో ఉండే యువత కొత్తగా ఆలోచించి వచ్చే పర్యాటకులకు హోం స్టే వంటి సౌకర్యాలు కల్పించి, అరుదుగా కనిపించే విషయాలను పరిచయం చేస్తే పర్యాటకం పెరుగుతుంది. దీని ద్వారా ఉపాధి మార్గాలు వస్తాయి. అది జీవన శైలిని పెంచుతుంది. దీని కోసం పర్యాటకులను ఆకర్షించడం, క్రమశిక్షణగా ముందుకు వెళ్లడం, ప్రణాళికతో సౌకర్యాలు కల్పన అనేవి ముఖ్యం. దీన్ని యువత అర్థం చేసుకోవాలి. దీనివల్ల పర్యాటకం పెరగడంతో పాటు గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సులభమవుతుంది. నేను ఇక్కడికి వచ్చాకా రూ. 1500 పెట్టి కొన్ని ఉత్పత్తులు కొన్నాను. అలాగే ఇక్కడికి వచ్చేవారు కూడా గిరిజన ఉత్పత్తులకు అంబాసిడర్ అవుతారు.
సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం ద్వారా కాఫీ, పసుపు, మిరియాలు ఇతర ఉత్పత్తులు చాలా నాణ్యంగా ఉంటాయి. మన్యం ప్రాంతాల్లో నీటి వనరుల లభ్యత బాగుంటుంది. దీనిని ఉపయోగించుకొని 100 గజాల్లో సాగు చేసిన అరుదైన పంటలకు అద్భుతమైన మార్కెటింగ్ చేసుకోవచ్చు. సినీ పరిశ్రమ కూడా ఎక్కడో విదేశాలకు వెళ్లే బదులు ఏజెన్సీ ప్రాంతాన్ని షూటింగులకు ఎంచుకుంటే ఇక్కడ స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది.
• గంజాయిని వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను
పర్యటనలో భాగంగా నేను స్థానికంగా ఉన్న యువకుడితో గంజాయి దొరుకుతుందా? అని ప్రశ్నిస్తే చక్కగా దొరుకుతుంది అని నవ్వుతూ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. గంజాయి అనేది గిరిజనులు ఆచార వ్యవహారాల్లో వనదేవతలకు నైవేద్యంగా సమర్పించే సంప్రదాయంగా ఉండేది. అది ఇప్పుడు పూర్తి వ్యాపారంగా మారిపోయింది. రాష్ట్రమంతా గంజాయి వాడకం అధికమైంది. దేశంలోనే గంజాయి సరఫరాలో రాష్ట్రం ముందంజలో ఉంది. ఈ వ్యాపారం దేశమంతటా పాకింది. యువతకు, చిన్న పిల్లలకు గంజాయి చాక్లెట్లు లభ్యం కావడం భయంగొలుపుతోంది. కడపలో ఇటీవల ఒక టీచర్ ను విద్యార్థులు హత్య చేసిన ఘటనలో గంజాయి ప్రభావం ఉందనే విషయాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గంజాయిని సామాజిక సమస్యగా గుర్తించాలి. గంజాయి దుష్పరిణామాలు చాలా లోతుగా ఉన్నాయి. గంజాయి బారిన పడిన వారి ఆరోగ్య పరిస్థితి, వారి కుటుంబాల పరిస్థితి కూడా చిన్నాభిన్నమవుతోంది. గంజాయి పండించే విషయంలో అంతా ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వానికి సహకరించి గంజాయి నిరోధానికి సహకరించండి. మీకు కచ్చితంగా ప్రత్యామ్నాయం చూపిస్తాం. మీరు దాని నుంచి బయటకు రండి. మీరు గంజాయిని వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. దాని నిరోధానికి అంతా సమష్టిగా ముందుకు వెళ్దాం. గిరిజనుల బతుకులు, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. గిరిజనుల ఆడబిడ్డలు నవ్వుతూ ఉంటేనే అడవికి కొత్తకళ వస్తుంది.
• డీజీపీ గారు పర్యటన వద్దన్నా మీ కోసం వచ్చాను
Font link
Full project
XML file
Song link